Monday, May 12, 2008

No loss with Chiranjeevi Party

చిరంజీవి ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి ఇంతవరకు పెదవివిప్పని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా దాని గురించి మాట్లాడారు. సెక్రటేరియట్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన తనంత తానుగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధికారిక అంశాలపై చర్చ పూర్తయిన తర్వాత సమకాలీన రాజకీయాల గురించి ఆయన మంత్రులతో కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి పార్టీవల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప ఎలాంటి నష్టమూ వుండదని మంత్రులకు ఆయన హామీ ఇచ్చారు. "చిరంజీవి పార్టీవల్ల మనకు ఎటువంటి నష్టం ఉండదు. పైగా లాభం. ఎందుకంటే కొత్త పార్టీవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ప్రతిపక్షాల మధ్య ఓట్ల విభజన ఎంత జరిగితే మనకు అంత లాభం. చిరంజీవి పార్టీ గురించి అనవసర భయాలొద్దు" అని వైఎస్ మంత్రుల్లో ధైర్యాన్ని నూరిపోసే యత్నం చేశారు. హఠాత్తుగా చిరు పార్టీ ప్రస్తావనను వైఎస్ ఎందుకు తెచ్చారనేది మంత్రులకే అంతుపట్టడం లేదు. చిరు పార్టీవల్ల కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టమనే వాదన ఊపందుకోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని ఆయన భావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లోనూ ఆందోళన ఏర్పడిందని భావించి, ఆ మేరకు వారికి ధైర్యాన్నిచ్చేలా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. చిరంజీవి త్వరలోనే పార్టీని ప్రకటించబోతున్నారనీ, ఆ మేరకు తనవద్ద సమాచారం ఉందని కూడా వైఎస్ వారికి తెలిపారు.
ShareThis

No comments: