కొంతకాలంగా చిరంజీవి ప్రభుత్వం ఏర్పాటుచేసిన జడ్ కేటగిరి భద్రతను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరితోనన్నా ప్రమాదం సంభవించే అవకాశమున్న అత్యంత ప్రముఖ వ్యక్తులకి మాత్రమే ఇచ్చే ఆ భద్రతను రాజకీయ పార్టీపెట్టే అవకాశమున్నదని వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవికి కల్పించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ భద్రతను చిరంజీవి వద్దనుకుంటున్నట్లు చిత్రమాలకు అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది. కారణం చిరంజీవిని ఎప్పుడు ఎవరు కలిసినా, లేదూ చిరంజీవి ఎప్పుడు ఎవరిని కలిసినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచార రూపంలో అందుతున్నాయి. చిరంజీవికి భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు ఈ సమాచారాన్ని అందిస్తున్నారు. దాంతో చిరంజీవి కదలికలు, ఆయన కార్యకలాపాలు రాష్ట్ర హోంశాఖకు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్న చిరంజీవికి ఇది ఇబ్బందికరంగా మారింది. అందుకే తనకు జడ్ కేటగిరీ భద్రతను ఉపసంహరించాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. దీనిపై హోమ్‌శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పైగా తనకు సంబంధించిన భద్రతను తనే కల్పించుకుంటాననీ, దీనికి అనుమతిని ఇవ్వమనీ చిరంజీవి ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన ఆంతరంగిక వర్గాల ద్వారా తెలిసింది. తన భద్రత కోసం ఆయన 'మెగా స్ట్రైకింగ్ ఫోర్స్' అనే స్వీయ రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దళాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, దాని పర్యవేక్షణకు ఎవర్ని నియమించాలి అనే అంశాల్ని తన సన్నిహితులతో చిరంజీవి చర్చిస్తున్నారు. ఈ దళం చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కనుసన్నల్లో ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment